ఈ క్షేత్రము కాకినాడ – రామచంద్రాపురం ప్రధాన రహదారిలోని చోడవరం గ్రామం నుంచి చేరవచ్చును. రహదారి సక్రమంగా లేకపోవుటచేత ప్రైవేటు వాహనం ద్వారా చేరుట సులభము. మఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినవారు ఈ ఆలయ స్థిత నాగలింగేశ్వరస్వామికి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన శుభఫలితములు కలుగును అని ప్రజల విశ్వాసం. ఈ ఆలయ ముఖద్వారంపై శివకుటుంబము, ముఖమంటపముపై పరమేశ్వరుడు మార్కండేయుని యముడి బారినుండి రక్షించిన ఘట్టము శిల్పీకరించబడి వున్నవి.
ప్రస్తుతం వున్న ఆలయం 1994వ సంవత్సరంలో భక్తులు, ఆలయ నిర్మాణ కమిటీ ద్వారా పునఃప్రతిష్ఠతో సహా జరిగినట్లు తెలుస్తోంది. అంతక్రితం 1956వ సంవత్సరంలో ఆలయ నిర్మాణం జరిగినదట. ఈ ఆలయానికి ఉపాలయంగా గణనాథుని ఆలయం కలదు. ఇదికాక గ్రామంలో రామాలయము, వెంకటేశ్వరస్వామి ఆలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరుగును. అలాగే శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా నిర్వహింపబడును.