info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వరస్వామి – గొల్లపాలెం

ఆరుద్ర నక్షత్రం – ద్వితీయ చరణం

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై వున్నది. ఆలయమును చేరుటకు గొల్లపాలెం ప్రధాన రహదారి నుండి కాజులూరు వైపు మళ్ళవలెను. కాకినాడ నుండి కుయ్యేరు వైపు వెళ్ళు బస్సుల ద్వారా ఈ ఆలయానికి చేరవచ్చును. ప్రధాన రహదారి నుండి ఆలయం వరకు ఆటో సౌకర్యం కలదు. ఈ క్షేత్రము ఆరుద్ర నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. కనుక ఈ జాతకులు శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వరస్వామిని దర్శించి అర్చనాభిషేకాదులు నిర్వర్తించిన యెడల వారి గ్రహపీడలు తొలగి శుభఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.

గోకర్ణం (కర్నాటక రాష్ట్రం)లో వెలసిన స్వామివారే ఇక్కడ అదే పేరుతొ వెలియడం విశేషం. రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని శ్రీలంకకు తీసుకునివెళ్తునప్పుడు గణపతి ఎదురైనప్పుడు ఆ లింగాన్ని భూమిపై ఉంచిన స్థలమే గోకర్ణక్షేత్రము. ఆ క్షేత్రములోని శివుడు గోకర్ణేశ్వరుడు (మహాబలేశ్వరుడు) ఆ పేరుతొ గొల్లపాలెం గ్రామంలో శివలింగం వెలియడం విశేషం. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో అత్యంత సుందరతనంగా వుండడం భక్తులను అబ్బురపరుస్తుంది.

ఈ ఆలయంలో ఆంజనేయస్వామివారు క్షేత్రపాలకుడు. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యప్పస్వామి ఆలయాలు ఈ ఆలయ ప్రాంగణంలో వున్నాయి. అంతేకాక గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు విష్ణాలయం కూడా కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి, అయ్యప్పస్వామి జన్మదినం వైభవోపేతంగా జరుగుతుంది.