info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత కోటేశ్వరస్వామి – కోటిపల్లి

శతభిషం నక్షత్రం – ద్వితీయ చరణం

కోటితీర్థమితి ఖ్యాతం త్రీషులోకేషు విశ్రుతం
వింధ్యస్య దక్షిణేపార్స్వే గోదావర్యాస్తటే శుభే
ఛాయాసోమేశ్వరోదేవస్తత్ర సన్నిహితశ్శివః
తత్ర స్నానేన దానేన సద్యోముచ్యంతి మానవాః

ఈ క్షేత్రము చేరుటకు రాజమండ్రి, కాకినాడ మొదలగు ముఖ్య పట్టాణముల నుండి బస్సు సౌకర్యము గలదు. ద్రాక్షారామ నుండి విరివిగా వాహన సౌకర్యము గలదు. ఇటీవల కాకినాడ నుండి కోటిపల్లి వరకు రైలు మార్గానపోవు సౌలభ్యము సయితం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడినది. శతభిషం నక్షత్రం రెండవ పాదమునకు చెందిన క్షేత్రము కావుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చనము శుభదాయకం అని భక్తుల విశ్వాసము. కోటేశ్వరస్వామి వృత్తాంతము: స్వర్గాధిపతి అగు దేవేంద్రుడు విచక్షణా జ్ఞానము కోల్పోయి కామాంధుడై గౌతమమహర్షి వేషమున పోయి మహాసాద్వియగు గౌతముని ధర్మపత్ని అహల్యను సంగమించెను.

పిదప గౌతమమహర్షి వచ్చి చూడగా మార్జాలరూపుడై పారిపోచుండగా చూచి “దేవాధిపతియైయుండి కూడా నీతిబాహ్యమయిన చర్య చేసిన కారణమున నీ శరీరమంతయు సహస్ర యోనులు ఉద్భవించునని’ శపించెను. అట్లే పరపురుషుని గుర్తింపక అతనితో గూడినందులకు శిలవు గమ్మని అహల్యను శపించెను. అహల్య పశ్చాత్తాపముతో గౌతముని పాదాల చెంత పడి శాపవిముక్తికై వేడుకొనగా, శ్రీరామచంద్రమూర్తి పాదధూళి సోకినంతనే నీకు శాపవిముక్తి కాగలదని చెప్పను. అట్లే ఇంద్రుడు సైతము దుఃఖితుడై గౌతమమునిని శాప విమోచనమునకై అర్థించగా మహర్షి అతనితో యిట్లనెను ‘దేవేంద్రా! నీవు ఏక ముహూర్తమున కోటిలింగములను ప్రతిష్టించిన శాపవిముక్తడవు కాగలవు’ అనినంతనే ‘స్వామీ! ఏక కాలమున కోటిలింగములు ప్రతిష్టించుట యెట్లు సాధ్యపడగలదు, తరుణోపాయము తెల్పుమనగా ‘ఇంద్రా! కోటితీర్థ సమమగు గౌతమీనది యందు స్నానమాచరించి ఆ తటమున వెలసిన శ్రీ సిద్ధిజనార్ధన స్వామిని అర్చించి శాస్త్రోక్తముగా శివలింగము ప్రతిష్టింపుము. అది కోటి శివలింగములకు సమమగు”ననెను. అంతట దేవేంద్రుడు గౌతమముని చెప్పిన రీతిలో శివలింగ ప్రతిష్ఠ గావించి గౌతమమహర్షిని విమోచనకై ప్రార్థించెను.

గౌతముడు కనికరించి ఇంద్రుని దేహముపై నున్న సహస్ర యోనులను కన్నులుగా మార్చి అతనిని సహస్రాక్షుని చేసెను. అప్పటినుండి ఈ క్షేత్రమున చేసిన ఏ విధమయిన ధర్మ కార్యమైనను దానమైనను కోటిరెట్లు ఫలము నొసంగునని పురాణోక్తి. ఈ క్షేత్రమున శ్రీదేవి, భూదేవి సమేత సిద్ధిజనార్ధనస్వామి వారు క్షేత్ర పాలకులుగా విలసిల్లియున్నారు. ఈ ఆలయ ప్రాంగణమున ఇంకను శ్రీ ఉమా సమేత కోటీశ్వరస్వామి, శ్రీరాజరాజేశ్వరీ సమేత ఛాయాసోమేశ్వరస్వామి, శ్రీకాలభైరవుడు, నవగ్రహాలయము గలవు. ప్రధాన ఆలయములు మూడింటికి మూడు ఆసక్తిదాయకమగు వృత్తాంతములు వివరింపబడినవి.