ఈ క్షేత్రము మండపేటకు మరియు తాపేశ్వరం గ్రామమునకు సమీపమున కలదు. ఈ గ్రామమునకు ప్రత్యేకించి బస్సు సదుపాయం తక్కువ. మండపేట నుండి తాపేశ్వరం నుండి గాని ప్రైవేటు వాహనం ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము చిత్త నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులకు ఈ క్షేత్ర స్థిత అగస్త్యేశ్వరస్వామిని దర్శించుకుని అర్చన, అభిషేకాదులు నిర్వహించిన యెడల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం. అర్తమూరు క్షేత్రంలో కోలువైయున్న అగస్త్యేశ్వర లింగము అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో ఒకటి (మిగిలినవి మండపేట, తాపేశ్వరం, చెల్లూరు, వల్లూరు) అతి పురాతనమైన ఈ క్షేత్రము పునర్నిర్మాణ మరియు పునఃప్రతిష్ఠ 1996లో జరిగినది.
ఈ ఆలయము ఉన్న కూడలి యొక్క ప్రత్యేకత ఏమనగా కూడలిలో ఈ ఆలయంతో పాటు శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహము సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వరాలయము శివాలయ ప్రాంగణంలోనే రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము ఆలయానికి చేర్చి వెంకటేశ్వరస్వామివారి ఆలయము, ఆలయమునందు నాగబంధము మరియు గణపతి ఉపాలయాలలో కొలువైయున్నారు. స్వామివారి కళ్యాణోత్సవము ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా నిర్వహించబడతాయి. అంతేగాక ప్రతి పౌర్ణమికి చండీయాగము నిర్వహించుట ఈ క్షేత్ర ప్రత్యేకత.