రాజమండ్రి నుండి మురమళ్ళ వైపు వెళ్ళు బస్సు ఈ క్షేత్రము గుండా వెళ్ళును. ముక్తేశ్వరం నుండి ప్రైవేటు వాహనముల ద్వారా ఈ క్షేత్రమును చేరవచ్చును. అత్యంత పురాతన చరిత్రగల ఈ క్షేత్రము నిర్మాణపరంగా ఏ విధమైన ఆధారములు లేకున్ననూ ఆలయ నిర్మాణశైలి ఈ క్షేత్రము యొక్క ప్రాచీనతను కళ్ళకు కడుతుంది. ఇచ్చటి కళ్యాణ మండపం కూడా అతి పురాతనమైనది. 2003వ సంవత్సరంలో నాటి గోదావరి పుష్కరముల సందర్భంగా ఆలయ జీర్ణోద్ధరణ మరియు కాలక్షేప మండప నిర్మాణం జరిగింది. చండీశ్వరాలయం ఇటీవలే నిర్మించబడింది.
ఈ ఆలయ మంటపంలో వరుసగా వీరభద్రేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాశీ అన్నపూర్ణేశ్వరి, కాలభైరవుడు, బృంగీశ్వరుడు మరియు పార్వతీదేవి మూర్తులు కలవు. అంతరాలయంలో గణపతి కొలువై ఉన్నాడు. స్వామివారి కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ దశమిరోజున జరుగుతుంది. శరన్నవరాత్రులు విశేషంగా నిర్వహించబడతాయి. ఈ క్షేత్రంలో శివరాత్రి తీర్థం అతి విశేషంగా నిర్వహించబడుతుంది.