ఈ క్షేతము చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారి నుండి మరియు కె.గంగవరం నుండి కూడా మార్గము కలదు. రోడ్డు రవాణా సంస్థల బస్సులతో పాటు ప్రయివేటు వాహన (ఆటో) సౌకర్యం కూడా వుంటుంది. ఈ క్షేత్రము అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటిగానేగాక నక్షత్ర శివాలయాలలో ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదానికి చెందిన క్షేత్రం కావడం కూడా మరో విశేషం. అందువల్ల ఈ క్షేత్ర దర్శనం, అర్చన, ఉభయ ఫలదాయకం.
ద్రాక్షారామ భీమేశ్వర క్షేత్రమునకు చుట్టూ అష్టదిక్కులలో చంద్రునిచే ప్రతిష్టింపబడ్డ అష్టసోమేశ్వర లింగాలలో ఆగ్నేయ దిగ్భాగాన కొలువైన శంకర స్వరూపం ఈ ఉమాసమేత సోమేశ్వరులు.
ఈ క్షేత్రము వేల సంవత్సరముల చరిత్ర కలిగినది. గతంలో వున్న ఆలయం భూమి ఉపరితలమునకు సుమారు నాలుగడుగుల లోతులో ఉండేది. మెట్లుదిగి లోనికి ప్రవేశించేవారు. దరిమిలా 2011వ సంవత్సరంలో ఆలయం పునర్నిర్మాణం జరిగినది.
ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపము, చండీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఉపాలయములు గలవు. ఈ క్షేత్రములో ఈ ఆలయంగాక ఇంకా రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయము, వెంకటేశ్వరస్వామి ఆలయము, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయము మరియు ఆంజనేయస్వామివారి ఆలయము కలవు. స్వామివారి దివ్య కళ్యాణమహోత్సవము వైశాఖశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా అత్యంత వైభవోపేతంగా జరుగును. ఇది కాక ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవములు కూడా విశేషముగా జరుగుతాయి.