ఈ క్షేత్రము కాకినాడ – కోటిపల్లి ప్రధాన రహదారిలో కోటిపల్లికి ముందు కుడివైపుకు మూడు కిలోమీటర్ల దూరంలో కలదు (పాతకోట మార్గమునకు వ్యతిరేకదిశలో) గంగవరం నుండి ప్రైవేటు వాహనాలలో చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదానికి చెందినది. ఈ జాతకులు సుందరపల్లి యందు కోలువైయున్న శ్రీ ఉమా సమేత సోమేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం నిర్మాణకాలానికి సంబంధించి స్పష్టమైన ఆధారములు లేనప్పటికీ ఆలయ నిర్మాణ శైలిని బట్టి కనీసం ఐదారు శతాబ్ధముల పైబడి నిర్మాణం జరిగినట్లుగా తెలియుచున్నది. అయితే ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న కళ్యాణ మంటపం 1910వ సంవత్సరంలో నిర్మితమైనట్లు అచటి శిలాఫలకంపైన తెలియుచున్నది. అతి విశిష్టత గల ఈ ఆలయము భక్తులకు విశేషమైన ఫలాలను ఇస్తుందని గ్రామస్థుల ద్వారా తెలియుచున్నది. ఆలయ శిఖరంపై అనేక దేవతామూర్తుల శిల్పములు చెక్కబడివున్నవి. అంతరాలయంలో గణపతి కోలువైయున్నాడు. చైత్ర శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం పాంచాహ్నికంగా జరుగును. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు విశేషంగా నిర్వహించబడతాయి.