info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత శ్రీ మాండేశ్వరస్వామివారి దేవస్థానం – దోమాడ

ఆశ్లేష నక్షత్రం – ప్రథమ చరణంDomada

దోమాడ క్షేత్రం కాకినాడ – గొల్లలమామిడాడ రహదారిపై కలదు. ఈ ఆలయం రహదారికి చేర్చి వున్నది. కాకినాడ నుంచి గాని గొల్లలమామిడాడ నుంచి గాని రోడ్డు రవాణా సంస్థ బస్సుల ద్వారా లేదా ఆటో ద్వారా సులభంగా చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్రము శివాలయములందు ఆశ్లేష నక్షత్రం ప్రథమ పాదానికి సంబంధించినది. ఈ జాతకులు దోమాడ క్షేత్రాన కొలువై వున్న శ్రీ ఉమా సమేత శ్రీ మాండేశ్వరస్వామివారి దర్శన, అర్చకాభిషేకముల వల్ల విశేష ఫలములు పొందగలరని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయ స్థిత శివలింగము గతంలో ప్రస్తుతమున్న ఆలయానికి సుమారు ఫర్లాంగు దూరంలో ఒక ఒత్తైన మైదానంపై ఉండెడిదట. ప్రసవ కష్టమైన స్త్రీల తాలూకు బంధువులు అచట కొబ్బరికాయ కొట్టిన యెడల ఆ స్త్రీకి సుఖప్రసవమయ్యేదని స్థానికుల కథనము. అంతేకాక ఇతరత్రా ఇబ్బందులు ఉన్నవారు కూడా స్వామికి మ్రొక్కిన యెడల తగు ఫలం పొందేవారట. ఆ ప్రాంతాన్ని మాండేశ్వరస్వామి దిమ్మ అనేవారట.శునకములు ఇతర జంతువులూ అచట శివలింగమును అపవిత్రము చేయుట చూసి గ్రామపెద్దలు ఆ లింగమును సమీపములో ఉన్న కాలువలో నిమజ్జనం చేశారు.

ప్రస్తుత ఆలయము 1970వ సంవత్సరంలో నిర్మించబడినది. శివలింగము కాశీనుంచి తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేశారట. అయితే ఆ లింగమున దోషమున్నట్లు గమనించి సుమారు 15ఏళ్ల క్రితం మరొక లింగాన్ని తెప్పించి పునఃప్రతిష్ఠ చేశారు. ఇదంతయూ గ్రామంలోని తుల విరాళాలు మరియు సహకారంతో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం ప్రైవేటు ఆలయం. స్వామివారి దివ్య కల్యాణోత్సవం మాఘ బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఈ గ్రామంలో రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం కూడా కలదు.