వాకతిప్ప గ్రామం చేరుటకు రామచంద్రాపురం నుండి బస్సు సౌకర్యం కలదు. అలాగే కోరుమిల్లి గ్రామమునకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వుండడం చేత ప్రైవేటు వాహనాల ద్వారా కూడా ఈ క్షేత్రాన్ని చేరవచ్చును. పూర్వాషాఢ నక్షత్రం నాలుగవ పాదమునకు చెందిన క్షేత్రము అగుట చేత ఈ జాతకులకు క్షేత్ర దర్శనము, అర్చన శుభదాయకం అని భక్తుల విశ్వాసము. ఈ క్షేత్ర స్థిత శివలింగము గతంలో చెంతనే వున్న చెరువులో కప్పబడి ఉండెడిదట. ఉత్తరోత్తరా 1994వ సంవత్సరంలో గ్రామస్థుల సహకారంతో ఆలయ నిర్మాణం శివలింగ ప్రతిష్ఠ జరిగినది.
అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోలువైయున్నారు. గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామివారి ఆలయం మరియు వెంకటేశ్వరస్వామివారి ఆలయం కలవు. స్వామివారి కళ్యాణోత్సవము జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఇంకా గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి విశేషంగా నిర్వహించబడతాయి.