info@bheemasabha.com

శ్రీ ఉమా పార్వతీ సమేత రాజలింగేశ్వరస్వామి – మాచర

ఉత్తరాషాఢ నక్షత్రం – ద్వితీయ చరణంMachara

ఈ క్షేత్రము సుప్రసిద్ధ అష్టసోమేశ్వర క్షేత్రమైన కోరుమిల్లికి అతి సమీపమున కలదు. అంతేకాక మాచర క్షేత్రం కూడా నవజనార్ధన క్షేత్రం కావడం విశేషం. ఈ క్షేత్రమును కాకినాడ నుండి కోరుమిల్లి వెళ్ళు బస్సుద్వారా చేరవచ్చును. మండపేట నుండి ప్రైవేటు వాహనముల ద్వారా చేరవచ్చును. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ఉత్తరాషాఢ నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులు మాచరయందు కోలువైయున్న శ్రీ ఉమా పార్వతీ సమేత రాజలింగేశ్వరస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితము పొందగలరని భక్తుల విశ్వాసం.

అతి పురాతన క్షేత్రాలలో ఒకటైన ఈ శివలింగ ప్రతిష్ఠ సుమారు 2060సంవత్సరాల క్రితం విక్రమార్కులచే జరిగినట్లు కథనం. పంచవటీ తీరమైన ఈ గ్రామము పూర్వము ఋషులు, మునీశ్వరులు తపస్సు చేసిన ప్రదేశం కావడం విశేషం. పూర్వం విక్రమార్కచక్రవర్తి నవజనార్థన క్షేత్ర సందర్శనం తరువాత ఈ ప్రాంతంలో శివాలయములు లేని కారణముచే ఇచట శివలింగ ప్రతిష్ఠ చేసినట్లు పూర్వగాథ. రాజుచే ప్రతిష్టింపబడ్డ కారణం వల్ల ఈ స్వామీకి రాజలింగేశ్వర నామము కలిగినట్లు తెలియుచున్నది.

ముఖమంటప నిర్మాణం 1984వ సంవత్సరంలో జరిగినది. అంతరాలయంలో గణపతి కొలువై ఉన్నారు. నంది క్రింద నాగబంధము కలదు. గ్రామంలో పైన తెలుపబడ్డ జనార్ధన ఆలయంతో పాటు విశేష ప్రాధాన్యం గల మాచరమ్మ ఆలయం కూడా కలవు. మాఘ శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి కళ్యాణోత్సవము పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా జరుగుతాయి.