ఈ క్షేత్రము కె.గంగవరం నుండి కోరుమిల్లి మార్గమున కలదు. కాకినాడ, రాజమండ్రి నగరాల నుండి బస్సు సౌకర్యం మరియు కె.గంగవరం నుండి ప్రైవేటు వాహన సౌకర్యం కలదు. చేరుట సులభము. ఈ క్షేత్రము మూల నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు పామర్రు ఆలయమున ఉన్న శ్రీ ఉమాపార్వతీ సమేత మల్లేశ్వర స్వామిని దర్శించి అభిషేకార్చనలు నిర్వర్తించిన యెడల వారి గ్రహదోషాలు తొలగి సుఖవంతులగుదురని భక్తుల విశ్వాసము. 1980లో ప్రాంతంలో పునరుద్ధరించబడ్డ ఈ ఆలయమునకు సుమారు 500సంవత్సరముల చరిత్ర గలదు.
ఈ ఆలయము నందు అమ్మవారు మరియు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు ఉపాలయాలలో కొలువై ఉండగా గణపతి అంతరాలయంలో దర్శనమిస్తారు.చండీశ్వరుడు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి చేర్చి పట్టాభి రామాలయం కలదు. గ్రామంలో ఆంజనేయస్వామివారి ఆలయం కలదు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి కూడా ఇక్కడ వైభవోపేతంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో శిలానంది రూపంతో పాటు సిమెంటుతో నిర్మించబడ్డ పెద్దనంది విగ్రహం కూడా కలదు.