ఈ క్షేత్రము జగత్ప్రసిద్ధి చెందిన విఘ్నేశ్వర క్షేత్రమే కాక పంచాయతనంలో పరమశివుని ఆలయం కూడా ప్రసిద్ధి. ఈ క్షేత్రము చేరుటకు రాజమండ్రి నుండి మురమళ్ళ వైపు వెళ్ళు బస్సులు మాత్రమే కాక అయినవిల్లికి ప్రత్యేక బస్సు సదుపాయం కూడా వున్నది. ముమ్మడివరం నుండి ముక్తేశ్వరం నుండి ప్రైవేటు వాహన సౌకర్యం కలదు. ఆలయం చేరుట సులభము. ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో ధనిష్ఠ నక్షత్రం రెండవ పాదానికి చెందినది. ఈ జాతకులు స్వామిని దర్శించుకుని అర్చనాభిషేకములు నిర్వహించడం వలన విశేష ఫలితముండగలదని భక్తుల విశ్వాసం.
అతి పురాతనమైన క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయ నిర్మాణం జరిగి వెయ్యి సంవత్సరముల పైబడినట్లుగా తెలుస్తున్నది. ఈ ఆలయం పైన పేర్కొన్న విధంగా ప్రసిద్ధ విఘ్నేశ్వర ఆలయంలో ఉపాలయంగా వుండడం విశేషం. ఈ ఆలయాన శివుని శిరస్సుపై గంగాదేవి కొలువై వుంటుంది. ఈ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి, కాలభైరవుడు, అయ్యప్ప మరియు చండీశ్వర ఆలయములు కలవు. స్వామివారి కళ్యాణోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు కనుమ రోజు ప్రభల తీర్థం ఇక్కడ ఘనంగా నిర్వహించబడతాయి.