info@bheemasabha.com

శ్రీగంగా సమేత వ్యాసేశ్వరస్వామివారి దేవస్థానం – పల్లిపాలెం

భరణి నక్ష్హత్రం – తృతీయ చరణంPallipalem

శ్రీ పార్వతీ హృదయ పంకజ భాస్కరాయ
గంగామనః కుసుమగుచ్చకపుష్పదాయ
నిత్యంసమాశ్రిత జనావనదీక్షితాయ
వ్యాసేశ్వరాం జగతాంపతయేనమస్తే.
పై పద్యము పీఠికాపుర ఆస్థాన కవివర్యులు, శతావధాని కీ.శే. ఓలేటి వెంకటరామశాస్త్రిగారి వ్యాసేశ్వరాష్టకంలోనిది. ఈ పద్యం ఆలయం కుడ్యంపైన చెక్కబడియుండటం విశేషం. ఇక ఈ క్షేత్రం ఇంజరం గ్రామమునకు సమీపంలో కలదు. క్షేత్రమును చేరుటకు కాకినాడ నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారి బస్సు సౌకర్యం ఉన్నను ఇంజరం గ్రామం నుండి ఆటో లేదా ఇతర రవాణా సాధనాల ద్వారా పల్లిపాలెం జేరుట సులభం. వ్యాసమహర్షి ద్వారా ప్రతిష్టితమయినట్లుగా భావించబడుతున్న ఈ క్షేత్రం భరణి నక్షత్రం, తృతీయ పాదంలో జన్మించిన వ్యక్తులకు విశేష ఫలాన్నిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రస్తుత ఆలయం సుమారు రెండు శతాబ్దములకు పూర్వం నిర్మితమయినట్లు తెలియుచున్నది. తదుపరి అనేక మంది దాతల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమములు జరిగినట్లు తెలియుచున్నది.

ఆలయమునకు ఉత్తరంగా ఆత్రేయ గోదావరినది ప్రవహిస్తున్నది. పశ్చిమాభిముఖంగా శివుడు ఉండడంతో కాశీ సమక్షేత్రంగా భావిస్తారు. ఈశాన్యంగా పుష్కరిణి కలదు. దక్షిణదిశలో ఔదుంబర వృక్షం వుండటం ఇక్కడి విశేషం. సంతానలేమిచే బాధపడేవారు ఈ క్షేత్రంలో అర్చనాభిషేకాదుల వల్ల ఫలితం కలుగగలదని భక్తుల విశ్వాసం. అంతేకాక అపరిష్కృతమయిన సమస్యలు వ్యాసేశ్వరస్వామివారి కృపచేత పరిష్కారం అవుతాయని కథనం. ఈ క్షేత్రంలోని మరొక విశేషం ఏమనగా ఇక్కడి శివలింగంపై తృతీయనేత్రం మాదిరిగా వుండటం అభిషేక సమయాలలో శివలింగం తాకిన వారికి విద్యుత్తు తాకినప్పుడు మాదిరిగా జలదరింపు కలుగుతుందట. ఈ ఆలయంలోని నవగ్రహ మంటపంలో ఆంజనేయస్వామి వారి విగ్రహం ప్రతిష్టించారు. ఇవికాక ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, దత్తాత్రేయస్వామి కొలువై యున్నారు. వైశాఖశుద్ధ ఏకాదశికి స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.