info@bheemasabha.com

శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి – బ్రహ్మపురి

అశ్వనినక్షత్రం – ప్రథమచరణంBrahmapuri

ఈ క్షేత్రము వృద్ధగౌతమి నదీతీరాన విలసిల్లియున్నది. ఈ క్షేత్రము చేరుటకు యానాం – ద్రాక్షారామ రహదారి యందలి ఇంజరం నుండి వెళ్ళవచ్చును. లేదా యానాం గోదావరి వంతెన నుండి గట్టుమీదుగా కోటిపల్లి వైపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో కలదు.
ఈ క్షేత్రము నక్షత్ర శివాలయాలలో మొట్టమొదటి నక్షత్రము అశ్వని నక్షత్రపు ప్రథమ చరణమునకు చెందినది. ఈ నక్షత్రమున జన్మించిన వ్యక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి అర్చన, అభిషేకాదులు నిర్వహించిన ఎడల వారి సమస్త గ్రహపీడలు తొలగి సుఖవంతులగుదరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

నక్షత్ర శివాలయాలలో మొదటిదైన ఈ ఆలయమునకు మరియు గ్రామమునకు విశేష పూర్వచరిత్ర కలదు. పూర్వము రావణుడు ప్రతిరోజూ ప్రాతఃకాలమున వెయ్యి శివలింగాలను పూజించేవాడు. అతని వధనానంతరము ఆ శివలింగాలను ఆ విధంగా పూజించేవారు ఎవరూ లేక కాశీ గంగా నదీజలాల్లో కలిపివేశారట. ఆ లింగాలు అప్పుడప్పుడు జాలర్లకు దొరుకుతుండేవట. 1958వ సంవత్సరంలో కీ.శే. శ్రీ చంద్రాభట్ల వెంకటరామశాస్త్రిగారు కాశీ వెళ్ళినప్పుడు జాలర్లు గంగానదిలో లభించిన ఒక శివలింగం (నర్మదబాణం) తెచ్చినారు. అప్పుడే “బ్రహ్మపురి” గ్రామంలో నిర్మించబడుతున్న శివాలయంలో ఆ లింగమును ప్రతిష్ఠించినారు. ఈ లింగము స్వతస్సిద్ధముగా మూడు విభూతిరేఖలను, మూడవ కన్నును కలిగియుండుట ప్రత్యేకత. భక్తితో ఈ శివుని అర్చించిన వారికి తమ తమ కోరికలు నెరవేరుతున్నాయని ఆయాభక్తుల అనుభవాలు.Brahmapuri2

పార్వతీ పరిణయ సమయంలో బ్రహ్మగారి ఒకతలలోని కండ్లు మోహదృష్టితో పార్వతిని చూచుచుండుటను చూచిన పరమేశ్వరుడు చేతితో కొట్టగా ఆ శిరస్సు బ్రహ్మనుండి వేరైనదేగాని శివుని చేతి నుండి బ్రహ్మ హత్య కారణంగా తల ఊడలేదు. శంకరుడు పవిత్రనదీ జలాలలో స్నానం చేస్తూ వచ్చి ఈ గ్రామము వద్ద గౌతమీ నదిలో మునిగి లేచే సరికి శివుని చేతి నుండి బ్రహ్మగారి తల విడిపోయిందట. ఆ కారణం చేత ఈ గ్రామానికి “బ్రహ్మపుర్రె” అని పేరువచ్చి కాలక్రమంగా మార్పులు వచ్చి ఇప్పుడు “బ్రహ్మపురి”గా పిలువబడుచున్నది. ఇది స్థల పురాణం. ఈ ఆలయము ప్రవేశ ద్వారమునకు ముందు ఆంజనేయస్వామి వారి విగ్రహము దర్శనమిస్తూ భక్తులకు స్వాగతం చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆలయం లోపల శ్రీఅన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామితో పాటు మహాగణపతి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, వెంకటేశ్వరస్వామి, స్వామి అయ్యప్ప మరియు షిరిడీసాయినాథుని ఉపాలయము కలవు.

ఈ గ్రామమందు ఈ ఆలయం కాక శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం కూడా కలదు. మాఘబహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామితో పాటు శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి మరియు వేణుగోపాలస్వామివార్ల దివ్య కల్యాణములు నిర్వహింపబడుట విశేషము. ఈ ఆలయం శ్రీ రామమడుగుల వెంకటరత్న సోమయాజులుగారిచే నిర్మించబడినట్లు బ్రహ్మశ్రీ చంద్రాభట్ల వెంకటరామశాస్త్రిగారు ఆలయమునకు స్థలము దానంగా ఇచ్చినట్లు అలాగే శ్రీమతి కాకర్లపూడి వెంకట నరసమ్మగారు ధూప దీప నైవేద్యముల నిమిత్తము మాగాణి భూమిని సమకూర్చినట్లు ఇచ్చటి శిలాఫలకం ద్వారా తెలియుచున్నది. అనేక సంవత్సరములుగా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమములను శ్రీయుతులు సాగివెంకట సూర్యనారాయణరాజుగారి కుటుంబీకులు మరియు గ్రామంలోని ఇతర భక్తులు నిర్వహిస్తున్నారు.