ఈ క్షేత్రము రామచంద్రాపురం పట్టణానికి సమీపంలో గలదు. రామచంద్రాపురం వరకు విస్తృత బస్సు సౌకర్యం కలదు. అక్కడినుండి ప్రైవేటు వాహనం ద్వారా వెళ్ళవచ్చును. మోడరన్ విద్యా సంస్థల వారు గ్రామాల దత్తత కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఈ గ్రామమునకు రామచంద్రాపురం నుండి ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు తెలిసినది. ఈ క్షేత్రం పునర్వసు నక్షత్రం నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఇచ్చటి స్వామిని అర్చించి అభిషేకార్చనలు చేసిన ఎడల విశేష ఫలములను పొందగలరని భక్తుల నమ్మకం.
సుమారు నూట ఏభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం జీర్ణావస్థకు చేరడంతో 2007వ సంవత్సరంలో పునర్నిర్మాణం, పునఃప్రతిష్ఠ దేవాదాయశాఖ మరియు గ్రామస్థుల సహకారంతో జరిగినది. ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. గ్రామంలో రెండు రామాలయములు కలవు. చైత్ర బహుళ ఏకాదశి నుండి స్వామివారి కళ్యాణము పాంచాహ్నికంగా జరుగుతుంది. దేవీనవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా నిర్వహించబడతాయి.