info@bheemasabha.com

అష్టసోమేశ్వరక్షేత్రం – కోటిపల్లి

శతభిష నక్షత్రం – ప్రథమ చరణం003

కోటితీర్థమితి ఖ్యాతం త్రీషులోకేషు విశ్రుతం
వింధ్యస్య దక్షిణేపార్స్వే గోదావర్యాస్తటే శుభే
ఛాయాసోమేశ్వరోదేవస్తత్ర సన్నిహితశ్శివః
తత్ర స్నానేన దానేన సద్యోముచ్యంతి మానవాః

ఈ క్షేతము చేరుటకు రాజమండ్రి నుండి కాకినాడ నుండి రోడ్డు రవాణా శాఖవారి బస్సు సౌకర్యము విశేషముగా కలదు. అలాగే ద్రాక్షారామ నుండి ప్రయివేటు వాహన (ఆటో) సౌకర్యం కూడా కలదు. చేరుట అతి సులభము. ఈ క్షేత్రము చంద్ర ప్రతిష్టిత అష్టసోమేశ్వర క్షేత్రాలలో ఒకటి, ఈ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర లింగమునకు దక్షిణ దిక్కున కలదు. అలాగే నక్షత్ర శివాలయాలలో శతభిషం నక్షత్రం మొదటి పాదానికి చెందిన క్షేత్రం కావడం మరో విశేషం. అందువల్ల ఈ క్షేత్ర దర్శనం, అర్చనాభిషేకాదుల వల్ల విశేష ఫలితాలు కలుగు అవకాశం గలదు.

శ్రీఛాయాసోమేశ్వరునివృత్తాంతము: పూర్వము చంద్రుడు తన గురుపత్నియగు తారను జూచి కామపరవశుడై ఆమెను గూడిన కారణమున తన సహజఛాయను గోల్పోయెను. క్షయవ్యాధి పీడితుడాయెను. తన సమస్యలకు గురుపత్నీ సమాగమమే కారణముగా నెంచి పశ్చాత్తాపముతో తరుణోపాయము గానరాక శ్రీమన్నారాయణుని పలువిధముల గీర్తించి, ఆయనకై తపమొనర్చెను. దానికి కరుణాంతరంగుడు శ్రీహరి కరుణించి, చంద్రుని యాతన గ్రహించినవాడై అతనితో “చంద్రా! నీవు కోటితీర్థమునకు జేరి యచటి గౌతమీనది యందు స్నానము గావించి, సిద్ధిజనార్ధన నామముతో వెలసియున్న నన్ను దర్శించి, శ్రీ కోటీశ్వరుని భక్తిశ్రద్ధలతో గొలిచి, ఈ క్షేత్రమున నీ పేరున శ్రీపార్వతీ సహిత సోమేశ్వరలింగమును, స్థాపించి బిల్వదళములతో పూజించిన యెడల నీ పూర్వపు ఛాయను తిరిగి పొందగలవని వరమిచ్చెను”. చంద్రుడట్లే గావించి తనఛాయను తిరిగిపొందెను. ఆ విధంగా ఈ లింగమునకు “ఛాయాసోమేశ్వరుడ”నియు, ఈ క్షేత్రమునకు “సోమతీర్థ”మనియు పేర్లు.

ఈ లింగము భోగలింగము. అట్లు ఈ క్షేత్రము “కోటిఫలి” క్షేత్రమయినది. ఈ క్షేత్రమునే “ఇంద్రతీర్థమ”ని కూడా పిలుతురు.
ఈ క్షేత్రమున శ్రీదేవి, భూదేవి సమేత సిద్ధిజనార్థానస్వామి వారు క్షేత్రపాలకులుగా విలసిల్లియున్నారు. ఈ ఆలయప్రాంగణమున ఇంకను శ్రీ ఉమా సమేత కోటీశ్వరస్వామి, శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయాసోమేశ్వరస్వామి, శ్రీకాలభైరవుడు, నవగ్రహాలయము గలవు. ప్రధాన ఆలయములు మూడింటికి మూడు ఆసక్తిదాయకమగు వృత్తాంతములు వివరింపబడినవి.